GUNTUR NEWS: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
MINISTER SANDHYARANI REVIEW MEETING
జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ప్రణాళికతో ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి మహిళ శిశు సంక్షేమం , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు , అడిషనల్ ఎస్పీ సుప్రజ లతో కలిసి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధికారులతో మాట్లాడుతూ మహిళా సాధికారిత, జీవనోపాదులు మెరుగుదలకు ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మార్చి 8వ తేదీ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల అమ్మకాలకు రూపొందించిన ఈ కామర్స్ యాప్ ద్వారా కొనుగోలు జరిగేలా గ్రామ ప్రాంతాల్లో డిఆర్డిఏ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా అధికారులు స్వయం సహాయక సంఘాల మహిళలను సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాదుల మెరుగుదలకు నిర్దేశించిన సంక్షేమ పథకాలు ఈ బైకు, ఈ ఆటో, ఇతర స్వయం ఉపాధి పథకాల ద్వారా మంజూరు చేసిన యూనిట్లు మహిళా దినోత్సవం నాటికి గ్రౌండిగ్ జరిగేలా బ్యాంక్ అధికారులను సమన్వయం చేసుకుంటూ సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల ద్వారా మహిళ సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరిస్తూ సభా ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. మహిళ రక్షణకు అమలు చేస్తున్న కార్యక్రమాలపైన పోలీస్ శాఖ స్టాల్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించిన మహిళల సన్మాన కార్యక్రమానికి చర్యలు తీసుకోవాలన్నారు.