GUNTUR NEWS: ఆకలితో ఉన్నవారికి రూ.5కే ఆహారం – క్యాంటీన్లలో ఆహారంపై పేదల హర్షం
GUNTUR MLA, COMMISSONER VISIT
అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకుంటున్న ప్రజలు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తూ, రూ.5తో ఆకలి తీరుస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. సోమవారం మిర్చి యార్డ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పశ్శిమ నియోజకవర్గ శానసభ్యులు గల్లా మాధవితో కలిసి పరిశీలించి, టిఫిన్ చేసి, ప్రజలతో మాట్లాడి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే నాణ్యమైన, రుచికరమైన ఆహారం పేదలకు అందుతుందన్నారు. ప్రధానంగా మిర్చి యార్డ్ దగ్గరలోని క్యాంటీన్ లో పూటకు 5 వందల మందికి పైగా ఆహారం తీసుకుంటున్నారన్నారు. ప్రజలు కూడా ఆహార నాణ్యత, రుచిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. క్యాంటీన్లకు వస్తున్న పేదవారికి ఎవ్వరికీ ఆహారం అందలేదని ఫిర్యాదు రాకూడదని, అందుకు తగిన విధంగా ఆహారం సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలన్నారు. ప్రజలు క్యాంటీన్ లో అందే ఆహారంపై తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలియ చేయవచ్చన్నారు.
శాసనసభ్యులు మాధవి మాట్లాడుతూ అన్నక్యాంటీన్లు పేదల ఆకలి తీర్చే అక్షయపాత్రల వలె నిలిచాయయని, ఆకలితో ఉన్నవారికి రూ.5కే ఆహారం అందించి వారికి అన్నపూర్ణలాగ రాష్ట్ర ప్రభుత్వం నిలిచేలా ముఖ్యమంత్రి అన్న క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. క్యాంటీన్లలో ఆహారంపై పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, రోజువారీ వచ్చే వారందరికీ ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.