
గుంటూరు నగరపాలక సంస్థలో హైడ్రామా కొనసాగుతోంది. కమిషనర్ పులి శ్రీనివాసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌన్సిల్ సమావేశం పెట్టేందుకు మేయర్ కావటి మనోహర్ నాయుడు సిద్దమయ్యారు. ఈ మేరకు వైసిపి కార్పొరేటర్ లతో కలిసి శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కౌన్సిల్ సమావేశానికి సిద్ధంగా లేని కమిషనర్ సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం కౌన్సిల్ హాల్ లో నిర్వహించారు. కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా మేయర్ మనోహర్ నాయుడు, డిప్యూటీ డైమండ్ బాబు మీడియాతో మాట్లాడారు. వరదల సందర్భంగా తొమ్మిది కోట్ల 24 లక్షల రూపాయల అవినీతి జరిగిందని మేయర్ ఆరోపించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశం పెట్టేందుకు కమిషనర్ స్పందించడం లేదని చెప్పారు. అయితే కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు, నిధుల దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించే విధంగా న్యాయపోరాటం చేస్తామన్నారు.










