గుంటూరు నగరపాలక సంస్థ పరధిలో త్రాగునీటి పైప్ లైన్ మరమత్తులు ఎప్పటికప్పుడు చేపట్టాలని, త్రాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ గారు పెద్దపలకలూరు, అడవితక్కెళ్లపాడు, నాయిబ్రాహ్మణ కాలనీ, నల్లపాడు, రాజీవ్ గాంధీ నగర్, వల్లూరివారితోట తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకొని ఇంజినీరింగ్ అధికారులు త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రిజర్వాయర్లను నిర్దేశిత గడువు మేరకు శుభ్రం చేయడంతోపాటుగా ఏఈల వారీగా తమ పరిధిలో పైప్ లైన్ల మరమత్తులను ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. పైప్ లైన్ల లీకుల వలన త్రాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఎమినిటి కార్యదర్శులు తప్పనిసరిగా త్రాగునీటి సరఫరా సమయంలో క్లోరిన్ స్యాంపిల్స్ తీసి, ప్రతి రోజు రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు. నూతన రోడ్ల ఏర్పాటుకు ముందే డ్రైన్ల నిర్మాణం చేయాలని, డ్రైన్ టు డ్రైన్ రోడ్ నిర్మాణం జరిగేలా ప్రతిపాదనలు ఉండాలన్నారు. నాయిబ్రాహ్మణ కాలనీలకో పారిశుధ్య పనుల పై స్థానికుల ఫిర్యాదు మేరకు ఆయా ప్రాంతాలను డ్రోన్ ద్వారా పరిశీలించి, పారిశుధ్య సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంపై శానిటేషన్ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్ పాయింట్ గా ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం డ్రైన్ల శుభ్రం జరగాలని స్పష్టం చేశారు. పర్యటనలో కార్పొరేటర్ సాంబిరెడ్డి, డిఈఈ శ్రీనివాస్, ఎస్ఎస్ సోమశేఖర్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
230 1 minute read