
తుఫాన్ అనంతరం ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితులను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పరిశీలించారు. ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో పర్యటించారు. ప్రత్తిపాడు వద్ద కొండవీడు లోయ వాగు వద్ద నీటి ప్రవాహం పరిశీలించారు. ప్రత్తిపాడు గ్రామంలో కాలువల పూడికలు తీస్తున్న పనులు పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు.
పెదనందిపాడు మండలం వరగాని గ్రామం వద్ద నక్కలవాగును పరిశీలించి, నక్కలవాగు, మేకలవాగును ట్రాక్టర్ పై దాటుకుంటూ వరగాని, నందిపాడు నల్లవాగు వంతెన వద్దకు జిల్లా కలెక్టర్ చేరుకున్నారు. పెదనందిపాడులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు.
అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రైతులతో మాట్లాడి పంటల మునక, వాటి పరిస్థితుల్ని తెలుసుకున్నారు. ప్రత్తిపాడు వద్ద పత్తి, మిరప పంటలు బాగా దెబ్బతిన్నాయని రైతులు చెప్పారు. పత్తి పంట పూర్తిగా పాడయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. యూరియా లభ్యత తక్కువగా ఉందని తెలిపారు.







