GUNTUR NEWS: తొలుత డ్రైన్ లు పూర్తి చేయండి… ఆ తర్వాతే రోడ్లు వేయండి – గుంటూరు కమీషనర్ ఆదేశం
GUNTUR COMMISSIONER VISIT DEVELOPMENT PROGRAM
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నూతనంగా రోడ్లు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో తొలుత డ్రైన్లు నిర్మాణం చేసిన అనంతరమే రోడ్లు నిర్మాణం చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రెడ్డిపాలెం, గోరంట్ల, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డివిజన్ల వారీగా ఎండ్ టు ఎండ్ నూతన రోడ్ల ఏర్పాటు ప్రతిపాదనలు ఉండాలన్నారు. ప్రధానంగా డ్రైన్ల నిర్మాణం చేసిన అనంతరమే రోడ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల నాణ్యతపై ఫిర్యాదులు అందుతున్నాయని, పనులు జరిగే సమయంలో ఎమినిటి కార్యదర్శులు, ఏఈలు తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రతి అభివృద్ధి పనిని నేరుగా పరిశీలించిన అనంతరమే బిల్లుల చెల్లింపుకు ప్రాసెస్ చేస్తామని తెలిపారు. అలాగే మైక్రో ప్యాకెట్స్ వారీగా పారిశుధ్య పనులు పిన్ పాయింట్ గా జరగాలని, ఎక్కడా గార్బేజ్ రోడ్ల మీద కుప్పలుగా ఉండడానికి వీలులేదని ప్రజారోగ్య అధికారులకు, శానిటేషన్ కార్యదర్శులకు స్పష్టం చేశారు.
పర్యటనలో డిఈఈ రమేష్ బాబు, ఆర్ఓ రవికిరణ్ రెడ్డి, ఎస్ఎస్ ఆయూబ్ ఖాన్, ఏఈలు, టిపిఎస్ లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.