
జిల్లాలో వర్షకాలం నేపథ్యంలో నిర్మాణ అవసరాలకు అనుగుణంగా ఇసుకను ముందస్తుగానే ప్రత్యేకమైన డంపింగ్ యార్డులలో నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని డిఆర్‌సి సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ సమావేశ ఎజెండా అంశాలకు సంబంధించి నిర్దేశిత నిబంధనలు ప్రకారమే ఇసుక తవ్వకాలు, అమ్మకాలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించేందుకు రెవెన్యూ అధికారులను సంబంధిత తహశీల్దార్లను సమన్వయం చేసుకొంటూ మైనింగ్ శాఖ అధికారులు నియమించాలన్నారు. ఇసుక అమ్మకాలు జరిగే ప్రాంతాల వద్ద ధరలు తెలియచేసే బోర్డులు, సీసీటీవీలు, ఏర్పాటు చేయాలని, సంబంధిత తహశీల్దార్లు తనిఖీలు చేసి నివేదిక అందించాలన్నారు. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటరు నివేదిక ప్రకారం జిల్లాలో 2021-2024 లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక త్రవ్వకాలు జరిపిన ఏజెన్సీలకు నోటీసులు ఇవ్వాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న స్టాక్ పాయింట్లు ప్రధాన రహదారులకు సమీపంలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్టాక్ పాయింట్ ల నుంచి వసూలు చేసేందుకు నిర్దేశించిన రవాణా చార్జీల పై ఇసుక వినియోగదారుల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు. రిజర్వాయర్ లో ఇసుక పూడికతీతకు సంబంధించి ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల సరిహద్దు ప్రకారం ప్యాకేజీలను సిద్ధం చేసి టెండర్లు పిలవటానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, జిల్లా మైన్స్ జియాలజీ అధికారి డి.శ్రీవెంకటసాయి, తెనాలి ఆర్‌టిఓ శ్రీహరి, జిల్లా భూగర్భ జలవనరుల శాఖ డీడీ వందనం, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మీ, ఏపి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ ఎండి.నజీమా బేగమ్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
 
 
 
  
 






