
ప్లాస్టిక్ రహిత, పర్యావరణహిత నగరంగా గుంటూరుని తీర్చిదిద్దటానికి రెడ్ క్రాస్ సంస్థ ముందుకు రావడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జూనియర్ రెడ్ క్రాస్, భారతీయ విద్యా భవన్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ” వార్ ఆన్ సింగల్ యూజ్ ప్లాస్టిక్ ” ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని ప్రసంగిస్తూ వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమి, నదులు, సముద్రాలు కలుషితమై వాటి మీద ఆధారపడి జీవిస్తున్న సమస్త ప్రాణులు నేడు ముప్పును ఎదుర్కొంటున్నాయని చెప్పారు. సింగల్ యూస్ ప్లాస్టిక్ ని నివారిస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. గుంటూరు నగరంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ప్లాస్టిక్ వలన కలుగు నష్టాలు, ప్రమాదాలు వంటి అంశాల మీద అవగాహన కలిగించటం ఆనందంగా ఉన్నదని తెలిపారు. ప్రాథమిక విద్యా స్థాయి నుండే విద్యార్థు లు ప్లాస్టిక్ నివారణ, పరిశుభ్రత, మొక్కల పెంపకం వంటి పర్యావరణహిత కార్యక్రమాలలో భాగస్వాములు అయి ప్లాస్టిక్ రహిత గుంటూరు నగరాన్ని తీర్చిదిద్దాలని ఆయన అభిలసించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ సొసైటీ ఎల్లవేళలా ముందు ఉంటుందని, గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న “వార్ ఆన్ సింగల్ యూజ్ ప్లాస్టిక్ ” ప్రాజెక్టులకు తన పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ రవి వడ్లమాని, రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ పి. రామచంద్ర రాజు, రెడ్ క్రాస్ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు రవి శ్రీనివాస్, ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, మట్టుపల్లి మోహన్, డాక్టర్ రమణ యశస్వి, బచ్చు నరసింహారావు, భారతీయ విద్యా భవన్ ప్రిన్సిపల్ హేమాంబ తదితరులు పాల్గొన్నారు.







