
పివికే నాయుడు మార్కెట్ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ జిఎంసి కౌన్సిల్ హాల్ లో ఆదివారం సమావేశం నిర్వహించారు. మార్కెట్ సెంటర్ నుంచి పివికే మార్కెట్ కు కాలినడకన వెళ్లిన పెమ్మసాని సమస్యలను స్వయంగా పరిశీలించారు. మార్కెట్ లోని కూరగాయలు, ఇతర వ్యాపారులతో మాట్లాడి వారికున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ అభివృద్ధి తదితర అంశాలపై అక్కడున్న వర్తక, వ్యాపార సంఘాల ప్రతినిధులతో చర్చించారు. తరువాత జరిగిన జిఎంసి కౌన్సిల్ హాల్ సమావేశంలో సంబంధిత మార్కెట్ వర్తక, వ్యాపారుల ప్రతినిధులతో పెమ్మసాని ఆయా సమస్యలపై గురించి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ అభివృద్ధి రీత్యా బహుళ అంతస్తుల భవన నిర్మాణం, అందుకు అవసరమయ్యే నిధుల సమీకరణతో పాటు షాపు నిర్వాహకులపై అద్దెల భారం పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఈ సమావేశంలో పెమ్మసాని చర్చించారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబోవు ఆయా నిర్మాణాలలో ఏఏ పద్ధతులను అవలంబిస్తే ప్రజలకు, షాపుల నిర్వాహకులకు ఉపయోగకరంగా ఉంటుంది అనే అంశంపై అధికారులు, నాయకులు, షాప్ నిర్వాహకులు, వర్తక సంఘ ప్రతినిధులు తదితరులు నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. త్వరలో చేపట్టపోవు ఆ నిర్మాణం, నిధుల భారం పడకుండా తీసుకోవాల్సిన నిర్ణయాలపై పూర్తిస్థాయిలో చర్చలు జరిగిన తర్వాత తెలియజేస్తామని చెప్పారు.







