
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సప్ గవర్నెన్స్ ఆచరణ సాధ్యం కాదనిసీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. సాంకేతికపరంగా అనేకమందికి అవగాహన లేని కారణంగా వాట్సప్ గవర్నెన్స్ వినియోగించడం సాధ్యం కాదని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలను కుదించడం, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం దారుణమన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతో ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని ఆరోపించారు. గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది పని చేస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కే ఎస్ లక్ష్మణరావు తోపాటు పీడీఎఫ్ అభ్యర్థులకు సంఘీభావం ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు నేతలు లక్ష్మణరావు, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.







