
మార్చి 17వ తారీకు నుండి జరిగే పదో తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా స్థానిక మణిపురంలోని శ్రీ బుర్ర నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో జరిగిన మా తల్లిదండ్రుల -విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి. లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో వున్న 200 దేశాలలో భారతదేశం విద్య పరంగా 134 స్థానంలో ఉందని చెప్పారు. భారత దేశంలోని 28 రాష్ట్రాలు, 7 కేంద్రప్రాలితి ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత పరంగా 32వ స్థానంలో ఉందని తెలిపారు. భారత దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు తన మాతృభాషలో సంతకం కూడా చేయలేని దుర్భర పరిస్థితిలో ఉన్నారని తెలియజేశారు. ఒకటవ తరగతిలో వందమంది చేరితే కనీసం ఐదుగురు కూడా డిగ్రీ దాక చదవలేక పోతున్నారని దీనికి ప్రధాన కారణం టెన్త్ క్లాస్లో ఉత్తీర్ణత లేకపోవడం వలన విద్యార్థులు విద్య నుంచి ప్రక్కదారి పట్టి వేరే కార్యక్రమాల్లో నిమగ్నమై చదువును అంతటితో ఆపుతున్నారని తెలియజేశారు. ప్రపంచంలో అత్యంత ధనవంతులు కేవలం విద్య ద్వారానే సాధించారని అటువంటి విద్యను, నైపుణ్య అభివృద్ధిని పదో తరగతిలోనే ఆపటం వలన వ్యక్తికి, కుటుంబానికి, దేశానికి చాలా నష్టం జరుగుతుందని తెలియజేశారు. కాబట్టి ఈ 37 రోజులు విద్యార్థులు పూర్తి సమయం పరీక్షల పై దృష్టి పెట్టి ఉత్తీర్ణత సాధించి తరువాత తరగతులకు కొనసాగించాలని కోరారు. తల్లిదండ్రులు తమ కుమారులు కుమార్తెల దినసరి కార్యక్రమంలను శ్రద్ధగా పర్యవేక్షించి ఉపాధ్యాయులు చెప్పే సూచనలను గమనించి విద్యార్థులను సరైన రీతిలో పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేయాలని కోరారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ కే సతీష్ మాట్లాడుతూ ఈరోజుల్లో తల్లిదండ్రుల నిజమైన ఆస్తి తమ పిల్లల చదువేనని, అత్యంత కీలకమైన ఈ పదవ తరగతి పరీక్షల సమయంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు స్వచ్ఛంద సేవా సంస్థలు సమిష్టిగా కృషిచేసి 100% ఉత్తీర్ణత సాధించి తద్వారా విద్యార్థుల భవిష్యత్తును మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు షేక్ జిలాని మాట్లాడుతూ మానవతా సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన వాలంటీర్స్ పదవ తరగతి విద్యార్థుల 100% ఉత్తీర్ణతలో చాలా సహాయకారులుగా ఉన్నారని తెలియజేశారు. తల్లిదండ్రులు స్కూలులో తమ పిల్లలకు జరుగుతున్న శిక్షణను బట్టి సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ కొరకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సేవా సంస్థలు చేయుచున్న కృషిని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇష్టంగా కష్టపడి చదివి 10వ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధిస్థామని ప్రతిజ్ఞ పూనారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, పదవ తరగతి విద్యార్థులు, మానవతా సభ్యులు సైకం శ్రీనివాసరెడ్డి, తిరుపతిరెడ్డి, గుడివాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.







