GUNTUR NEWS: వేసవిలో తాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి : గుంటూరు కమీషనర్ ఆదేశం
GUNTUR COMMISSIONER VISIT DEVELOPMENT PROGRAM
గుంటూరు నగరంలో వేసవిని దృష్టిలో పెట్టుకొని త్రాగునీటి సరఫరాకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, బిఆర్ స్టేడియం రిజర్వాయర్ దగ్గర పైప్ లైన్ లీకు మరమత్తులు శనివారానికి పూర్తి చేసి ఆదివారం ఉదయం నుండి సరఫరా అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. శనివారం బిఆర్ స్టేడియం రిజర్వాయర్ పైప్ లైన్ లీకు మరమత్తులను, డొంక రోడ్ లోని 3 వంతెనల వద్ద జరుగుతున్న వంతెన పనులను, నగరాల్లో పించన్ పంపిణీని, అమరావతి రోడ్ ఐడి హాస్పిటల్ వద్ద అన్న క్యాంటీన్ ని పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవిలో నగరంలో త్రాగునీటి సరఫరాలో ఏ సమస్య రాకుండా రిజర్వాయర్ల వారీగా ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. బిఆర్ స్టేడియం రిజర్వాయర్ పాత 600ఎంఎం డయా ఔట్లెట్ ఆర్సీసి డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ లీకు మరమత్తు పనులను నిర్దేశిత గడువుకు ఒక రోజు ఆలస్యంగా పనులు ప్రారంభించినందున శనివారం నాటికి పూర్తి చేసి ఆదివారం ఉదయం నుండి సరఫరా జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ చేయాలన్నారు. 3 వంతెనల దగ్గర జరుగుతున్న పనులను పరిశీలించి, రైల్ పేట నుండి వచ్చే డ్రైన్ నీటిని నేరుగా మేజర్ డ్రైన్ లోకి కలిపేలా నూతన కల్వర్ట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని, 3 వంతెనల వద్ద పెండింగ్ పనులు పూర్తి కావడానికి రైల్వే ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని జిఎంసి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరాల్లో పించన్ పంపిణీలో పాల్గొని సచివాలయ కార్యదర్శులు పించన్ దారుల ఇంటి వద్దకే వెళ్లి పించన్ అందించాలన్నారు. అనంతరం అమరావతి రోడ్ ఐడి హాస్పిటల్ వద్ద అన్న క్యాంటీన్ లో స్థానికులతో కలిసి టిఫిన్ చేసి ఆహార నాణ్యతపై ప్రజలను అడిగి తెలుసుకొని క్యూఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాన్ని ఆన్ లైన్ లో తెలిపారు. ప్రతి రోజు క్యాంటీన్ కి వచ్చే వారి సంఖ్యకు అనుగుణంగా ఆహారం ఇండెంట్ తెప్పించుకోవాలని, ఏ ఒక్కరికీ ఆహారం అందలేదని ఫిర్యాదు రాకూదని సిబ్బందికి స్పష్టం చేశారు. ఈ
పర్యటనలో ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈలు నాగభూషణం, కళ్యాణరావు, ఏసిపి మల్లిఖార్జున, ఆర్ఓ రవికిరణ్ రెడ్డి, ఎస్ఎస్ ఆయూబ్ ఖాన్, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి, ఏఈలు, టిపిఎస్ లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.