
ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను ప్రకారం వెంటనే కౌలు రైతుల రక్షణ, వారి సంక్షేమానికి నూతనంగా సమగ్రమైన కౌలుచట్టం తీసుకురావాలని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం హామీ లేని పంట రుణాలు కౌలు రైతులకు ఇచ్చి ఆదుకోవాలని తదితర డిమాండ్ల పరిష్కారానికి ఫిబ్రవరి 12 మండల ఆఫీసుల వద్ద ధర్నాలు జరపాలని, మార్చి 3 తేదీన జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కౌన్సిల్ సమావేశం తీర్మానించింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జములయ్య సమావేశం తీర్మానాలను విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆదివారం సంఘం అధ్యక్షులు ఎ. కాటమయ్య అధ్యక్షతన గుంటూరులోని మల్లయ్య లింగం భవన్ నందు కౌలు రైతుల సంఘం రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. భూ యజమానితో సంబంధం లేకుండానే గ్రామ సభలు నిర్వహించి భూ యజమాని ప్రమేయం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని, కౌలు. రైతులు పండిస్తున్న పంటలకు ఉచిత భీమా పథకాన్ని వర్తింప చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ జేశారు. కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన ప్రకారం కిసాన్ క్రెడిట్ కార్డులు కౌలు రైతులకు జారీ చేయాలని వీటి ఆధారంగా హమీ లేని పంట రుణాలు ఇచ్చి ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల నుండి రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దేవాలయ భూములను సాగు చేస్తున్న కౌలు రైతులకు కూడా వ్యవసాయ, ఉద్యానవన పథకాలు వర్తింపు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 2024 సంవత్సరంలో వ్యవసాయ సంక్షోభం వల్ల అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత ప్రతి కౌలు రైతు కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కౌన్సిల్ సమావేశం తీర్మానించిందని చెప్పారు. మార్చి 20వ తేదీన రబీలో నైనా కౌలు రైతులకు పంట రుణాలు అందించాలని కోరుతూ జిల్లా కేంద్రాల్లో ఉన్న లీడ్ బ్యాంకు మేనేజర్ ఆఫీసుల వద్ద ఆందోళన నిర్వహించాలని మరో తీర్మానం చేసిందని చెప్పారు. దేవాలయ భూములను సాగు చేస్తున్న కౌలు రైతులకు శాశ్వత కౌలు హక్కు పత్రాలు ఇవ్వాలని తీర్మానం చేసిందని చెప్పారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కంజుల విట్టల్ రెడ్డి, పి.వి.జగన్నాథం మరియు పల్నాడు కౌలు. రైతుల సంఘం నాయకులు పి. లక్షాధికారి తదితరులు పాల్గొన్నారు.







