
గుంటూరు, అక్టోబర్ 14: జిల్లాలో ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకతతో నిర్వహించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ జరగాలని స్పష్టం చేశారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు అందుబాటులో ఉండాలని, రవాణా వాహనాలను ముందుగానే సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రవాణాలో ఆలస్యం, చెల్లింపుల్లో జాప్యం, నాణ్యతపై వివాదాలు వంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే సాంకేతిక సహాయకులకు నాణ్యత పరీక్షలు, కొనుగోలు విధానం పై సరైన శిక్షణ ఇవ్వాలన్నారు. రైతులకు మార్గదర్శకత ఇవ్వడంలో వారు ముఖ్య భూమిక పోషించాల్సిన అవసరముందని అన్నారు.సివిల్ సప్లైస్, మార్కెటింగ్, వ్యవసాయ, సహకార, రవాణా శాఖల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేసి, రైతులకు మేలు కలిగే విధంగా ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.ఈ సందర్భంగా సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ కే. తులసి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వివరించారు. గత ఖరీఫ్ సీజన్‌లో ఎదురైన సమస్యలను ఈసారి పునరావృతం కాకుండా ముందుగానే తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.







