
గుంటూరు:-పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలసి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన పీకలవాగు అభివృద్ధి, రక్షణ గోడ నిర్మాణం, తాగునీటి సరఫరా నిర్వహణతో పాటు పలు ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రస్తావించిన అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.
పీకలవాగు అభివృద్ధి పై ఎమ్మెల్యే గళ్ళా మాధవి చేసిన ప్రధాన విజ్ఞప్తి

గుంటూరు నగరానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన పీకలవాగును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. పీకలవాగు మొత్తం పొడవునా సమగ్ర సర్వే నిర్వహించి, ఇంజనీరింగ్ అధికారుల చేత పూర్తి స్థాయి డిజైన్ రూపొందించి, ప్రారంభం నుంచి చివరి వరకు రెండు వైపులా కాంక్రీట్ రక్షణ గోడలు నిర్మించాలని కోరారు. ఇళ్లకు సమీప ప్రాంతాల్లో చెత్త కాలువలో పడవేయకుండా, పిల్లలు ప్రమాదానికి గురికాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి వర్షాకాలంలో పీకలవాగు ప్రవాహం సజావుగా సాగకపోవడం వల్ల లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, దీంతో గుంటూరు లాంటి నగరంలో ప్రతి వర్షాకాలం పునరావాస కేంద్రాల సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా తుఫాన్లు, సముద్రతీర ప్రాంతాల్లో మాత్రమే అవసరమయ్యే రిహాబిలిటేషన్ సెంటర్లు గుంటూరులో వర్షాలకే ఏర్పాటు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.
రానున్న ఎండాకాలం ఈ పనులు చేపట్టేందుకు అనుకూల సమయమని, ఇప్పుడే సమగ్ర డాక్యుమెంట్ మరియు ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి పీకలవాగు అభివృద్ధి పనులు ప్రారంభిస్తే భవిష్యత్తులో గుంటూరు ప్రజలను ఈ సమస్య నుంచి శాశ్వతంగా రక్షించవచ్చని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌కు మూసీ నది, విజయవాడకు బుడమేరు ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయో, గుంటూరుకు పీకలవాగు కూడా అంతే కీలకమని పేర్కొంటూ, నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ మొత్తం సజావుగా ప్రవహించేలా సమగ్ర చర్యలు తీసుకోవాలని కోరారు. పీకలవాగు అభివృద్ధిని ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టడం తన కర్తవ్యమని, ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గ తాగునీటి సరఫరా గురించి అభ్యర్థనguntur 3
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పలు మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ గంటపాటు కూడా తాగునీరు అందని పరిస్థితి ఉందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరమ్మత్తులకు గురైన పైప్‌లైన్లను పూర్తిగా రీడిజైన్ చేసి, ఆధునిక న్యూ వాటర్ సప్లై సిస్టమ్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై గతంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి నివేదికలు అందించామని, కొన్ని మార్పులు జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో చొరవ అవసరమని పేర్కొంటూ, సంబంధిత నివేదికలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు.
ఎమ్మెల్యే గళ్ళా మాధవి తన దృష్టికి తీసుకొచ్చిన అంశాల పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.










