
గుంటూరు: గుంటూరు జిల్లా పరిషత్ ఏసీ ఫంక్షన్ హాల్ వేదికగా రేపు (మార్చి 14వ తేదీ) ఉదయం 10 గంటలకు బహుజన వర్గాల భవిష్యత్తు, సామాజిక న్యాయంపై రాష్ట్ర స్థాయి భారీ సదస్సు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ మాలా ఎంప్లాయీస్ అసోసియేషన్ (APMUS) ఆధ్వర్యంలో “సోషల్ జస్టిస్ – ఫైనాన్షియల్ అలొకేషన్స్ – ఫ్యూచర్ ఆఫ్ బహుజన్ పీపుల్” అనే ప్రధాన అంశంపై ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
ఈ సదస్సులో ప్రధానంగా బహుజన వర్గాల ఆర్థిక హక్కులు, రాష్ట్ర బడ్జెట్‌లో ఆయా వర్గాలకు జరుగుతున్న కేటాయింపులపై లోతైన విశ్లేషణ చేయనున్నారు. ముఖ్యంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల సరైన వినియోగం, బడ్జెట్‌లో దక్కాల్సిన న్యాయం, మాలా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు.. విద్య, ఉద్యోగ అవకాశాలు, గృహ నిర్మాణాలకు సంబంధించి అమలు చేయాల్సిన ప్రత్యేక పథకాల ఆవశ్యకత తదితర కీలక అంశాలపై ప్రతినిధులు విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే, బహుజన వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణను కూడా ఈ వేదికపై ఖరారు చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.https://youtu.be/dQK7DO3fDHo?si=TAtJFtH85h9S7NQH
ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు పలువురు విశ్రాంత ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు జి.ఎస్.ఆర్.కె.ఆర్. విజయ్ కుమార్, డాక్టర్ పి.వి. రమేష్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ జుజ్జవరపు పూర్ణచంద్రరావు, అలాగే రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ ఉప్పులేటి దేవీ ప్రసాద్ తదితరులు ఈ సదస్సులో పాల్గొని తమ విలువైన సందేశాలను, మార్గనిర్దేశాన్ని అందించనున్నారు. బహుజన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు ఇప్పటికే పూర్తి చేశారు.http://GUNTUR LOCAL NEWS







