Guntur :భగవద్గీతపై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై జరుబుల బంగారుబాబు, శివకుమారి దంపతుల సౌజన్యంతో సోమవారం శ్రీమద్భగవద్గీత త్రయోదశ అధ్యాయంలోని క్షేత్రజ్ఞ విభాగయోగం ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ప్రధానకార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, జరుబుల బంగారుబాబు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయమిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి ప్రవచిస్తూ క్షేత్ర, క్షేత్రజ్ఞుల తత్త్వములను గూర్చి ఋషులెల్లరు పలు విధాలుగా వివరించారని, వివిధ వేదమంత్రాలను వేర్వేరుగా తెల్పారన్నారు. బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మకంగా, సహేతుకంగా తేటతెల్లం చేశారని ద్వేషము, సుఖం, దుఖం, స్థూలశరీరం, చైతన్యం, అను వికారాలతో కూడిన క్షేత్రస్వరూపం సంక్షిప్తంగా పరమాత్మే అన్నారు. తానే శ్రేష్ఠుడననే భావం లేకుండా, అహింస, క్షమించు గుణం, మనోవాక్కుల యందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, అంతఃకరణ స్థిరత్వము, మన శరీర ఇంద్రియముల నిగ్రము కలవారు మాత్రమే క్షేత్రజ్ఞుడు అవుతారని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియజేశారన్నారు.