వినుకొండలో 40 కుటుంబాలపై దౌర్జన్యం – చీఫ్ విప్ జివి ఆంజనేయుల జోక్యం
పల్నాడు జిల్లా వినుకొండలోని 6వ వార్డులో 40 కుటుంబాలు గత కొన్ని రోజులుగా తీవ్ర భయాందోళనలో జీవిస్తున్నారు. పద్మజ హాస్పిటల్ సమీపంలో, సుమారు 34 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన గేటెడ్ కమ్యూనిటీలో గృహాలు నిర్మించుకొని ఈ కుటుంబాలు ప్రశాంతంగా నివసిస్తున్నారు. అయితే, ఈ వెంచర్‌కు సంబంధం లేని ప్రముఖ వ్యాపారి సముద్రాల వెంకన్న అనే వ్యక్తి అక్రమంగా కట్టడాలు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఈ క్రమంలో నివాసితులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే, సముద్రాల వెంకన్న తనకు సంబంధించిన స్థలంలో ఎటువంటి మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో, గేటెడ్ కమ్యూనిటీకి రక్షణగా ఉన్న కాంపౌండ్ వాల్‌ను బలవంతంగా కూలగొట్టి, నివాసితులను భయభ్రాంతులకు గురిచేశాడు. అంతేకాకుండా, “మీ దిక్కున్న చోట చెప్పుకోండి” అంటూ బెదిరింపులు చేసినట్లు అక్కడి ప్రజలు తెలిపారు.
భయంతో ఉలిక్కిపడిన నివాసితులు వెంటనే మున్సిపల్ చైర్మన్ దస్తగిరిని, మున్సిపల్ కమిషనర్ బోస్‌ను, టౌన్ ప్లానింగ్ అధికారిని సంప్రదించి ఈ ఘటనపై న్యాయం చేయమని వేడుకున్నారు. ఈ విషయం చీఫ్ విప్ జివి ఆంజనేయుల దృష్టికి తీసుకెళ్ళగా, ఆయన వెంటనే స్పందించారు. సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు తగిన న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
తర్వాత మున్సిపల్ కమిషనర్ ఈ వ్యవహారంపై వివరణ ఇస్తూ, రోడ్ ఎక్స్టెన్షన్‌కు సంబంధించి ఎటువంటి అనుమతులు లేదా తీర్మానాలు మున్సిపాలిటీ నుంచి జారీ కాలేదని స్పష్టం చేశారు. చట్ట విరుద్ధంగా జరిగే ఈ నిర్మాణాలను ఆపేందుకు, అలాగే బాధితుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సమస్యను తెలియజేసిన వారిలో బెజవాడ వెంకట నాగేశ్వరరావు, వెంకటేశ్వరరెడ్డి, జె.ఆంజనేయులు, కొప్పురావూరి శ్రీనివాసరావు, ఎస్.కే.హమీద్, సిహెచ్.మణికంఠ, ఫణికుమార్, జి.ప్రసాద్, కే.ప్రసాద్, ఎం.సుబ్బారావు, కే.రామారావు, బి.ధనలక్ష్మి తదితరులు ఉన్నారు.
బాధితులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాము ఎన్నో ఏళ్లుగా ప్రశాంతంగా నివసిస్తున్న తమ వాసస్థలంపై ఇలాంటి దౌర్జన్య చర్యలు జరగడం వల్ల భయంతో ఉన్నామని, మున్సిపల్ అధికారులు మరియు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు తమకు అండగా నిలవాలని కోరారు. చీఫ్ విప్ జివి ఆంజనేయుల తక్షణ స్పందనకు, మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన హామీకి కృతజ్ఞతలు తెలిపారు.
వినుకొండలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. పౌర హక్కులను కాపాడటంలో ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు కఠిన వైఖరిని అవలంబించాలని ప్రజలు కోరుతున్నారు. చట్టపరమైన రక్షణ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి రావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.