
విజయవాడ, నవంబర్ 08:-రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన సృష్టించాలనే లక్ష్యంతో ఎన్.టి.ఆర్. జిల్లా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ శ్రీమతి షిరీన్ బేగం ఐపీఎస్ పర్యవేక్షణలో నగరంలోని ప్రధాన చౌరస్తాల్లో హెల్మెట్, సీట్‌బెల్ట్ ధారణ, ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు

.ఈ సందర్భంగా హెల్మెట్ ధరించిన బైక్ రైడర్లు, సీట్‌బెల్ట్ వేసుకున్న కార్ డ్రైవర్లు, యూనిఫాం ధరించి మోటారు వాహన చట్టాలను గౌరవించిన ఆటో డ్రైవర్లను పోలీసులు పూలతో సత్కరించారు. ఈ అభినందనలు ఇతర వాహనదారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
డీసీపీ షిరీన్ బేగం మాట్లాడుతూ, “చట్టాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత. హెల్మెట్ లేదా సీట్‌బెల్ట్ వాడడం మన ప్రాణ రక్షణకు చిహ్నం. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి. స్వీయ భద్రతే కుటుంబ భద్రత అని గుర్తుంచుకోవాలి” అని పిలుపునిచ్చారు.డీసీపీ గారి నేతృత్వంలో కొనసాగుతున్న ఈ అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో చట్టపరమైన చైతన్యాన్ని పెంపొందిస్తున్నాయని అధికారులు తెలిపారు.










