దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ భద్రమైన సమాజం దిశగా ముందడుగు వేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.మంగళవారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానం-ఈట్ స్ట్రీట్ వద్ద జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర,, డీటీసీ ఎ. మోహన్ అధికారులు తదితరులతో కలిసి రహదారి భద్రత వాకథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాకథాన్ బెంజ్ సర్కిల్ వరకు సాగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సాకారానికి రహదారి భద్రత కూడా అత్యంత ముఖ్యమని, యువతతో పాటు ప్రతిఒక్కరూ రహదారులను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరముందన్నారు. గతేడాది ఒక్క ఎన్‌టీఆర్ జిల్లాలోనే రోడ్డు ప్రమాదాల వల్ల 400 మందికి పైగా మరణించారంటే మన రహదారుల భద్రతపై ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన అవసరముందన్నారు. కేవలం వాహనాలను నడిపే వారు మాత్రమే కాకుండా దాదాపు 50 శాతం మరణాలు పాదచారులకు సంబంధించినవేనని వివరించారు. మనం రహదారులను సురక్షితంగా ఉపయోగించుకుంటే మనల్ని చూసి మిగిలినవారూ అదే దారిలో పయనిస్తారన్నారు. లైసెన్సు లేకుండా, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం సరికాదని.. మన భద్రత కోసమే వాటిని తప్పనిసరిగా ఉపయోగించాలనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఇంతగా అవగాహన కల్పిస్తున్నా బాధ్యత మరిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను కూడా పకడ్బందీ అమలుచేస్తున్నామని.. రహదారి భద్రత దిశగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగమవుతున్న వివిధ శాఖల అధికారులు, ఎన్‌జీవోలు, ప్రైవేటు సంస్థలకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. అదేవిధంగా ఇంటి నుంచి ఎంత భద్రంగా బయటికి వచ్చామో అంతే భద్రంగా ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలంటే ప్రతిఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర అన్నారు. రహదారి భద్రతకు ఇంజనీరింగ్ పరంగా వివిధ చర్యలు తీసుకుంటున్నామని.. వీటికి తోడు ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ధ్యానచంద్ర కోరారు. డీటీసీ ఎ.మోహన్ మాట్లాడుతూ ప్రమాదం జరిగాక బాధపడేకంటే, జరక్కుండా జాగ్రత్తపడటం అత్తుత్తమమని, రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రవాణా, రహదారులు- భవనాలు, పోలీస్, ట్రాఫిక్ తదితర విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు రహదారి భద్రతా కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాదచారులు కూడా ఎక్కడపడితే అక్కడ రోడ్డును దాటకుంటా ట్రాఫిక్ సూచనలు పాటించాలని సూచించారు. ఇప్పుడు నేర్చుకున్న విషయాలను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని డీటీసీ మోహన్ అన్నారు.కార్యక్రమంలో ఏపీఎన్‌జీజీవో నేతలు కేవీ శివారెడ్డి, ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు రహదారి భద్రత నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. సరైన అవగాహన ఏర్పరచుకొని రహదారి భద్రత ప్రాధాన్యాన్ని గుర్తించి, ఆచరించాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో కీలక భాగస్వాములు కావాలని కోరారు.
232 1 minute read