
అమరావతి :28-11-25:-బీసీ హాస్టళ్లలో అక్రమాలను అస్సలు సహించబోమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. పులివెందుల అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిణి బి. జ్యోతి అవినీతి, అక్రమాల ఆరోపణలు రుజువుకావడంతో ఆమెను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే, ఈ అక్రమాలకు పరోక్షంగా సహకరించిన జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి అంజలదేవీని విధుల నుంచి రిలీవ్ చేస్తూ విజయవాడ హెడ్ ఆఫీస్‌కు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
శుక్రవారం ఈ మేరకు మంత్రి సవిత ప్రకటన విడుదల చేశారు. పులివెందుల అధికారిణి జ్యోతిపై తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జాయింట్ డైరెక్టర్ ద్వారా విచారణ నిర్వహించగా, ఆరోపణలు నిజమని తేలినట్లు వివరించారు. దాంతో వెంటనే సస్పెన్షన్ చర్యలు తీసుకున్నామని చెప్పారు.తల్లిదండ్రుల స్థానంలో ఉండి విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు బాధ్యత వహించాల్సిన హాస్టల్ సిబ్బంది అక్రమాలకు పాల్పడటం తీవ్రంగా ఖండించిన మంత్రి సవిత, “ప్రభుత్వంపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టళ్లకు పంపిస్తున్నారు. ఆ నమ్మకాన్ని దెబ్బతీయడం ఏ పరిస్థితుల్లోనూ సహించం” అని హెచ్చరించారు.సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీ విద్యార్థులకు పోషకాహారం, ఆరోగ్య భద్రతతో కూడిన నాణ్యమైన విద్య అందించడానికే కట్టుబడి ఉందని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యాలకు వ్యతిరేకంగా పనిచేసే ఎవరిపైనా కఠిన చర్యలు తప్పవని మంత్రి సవిత స్పష్టంచేశారు.







