
అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యాటక శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
భారీ లక్ష్యాలు – మౌలిక వసతులు: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు 2029 నాటికి 50 వేల హోటల్ గదుల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని సీఎం స్పష్టం చేశారు. వీటితో పాటు పర్యాటకులకు స్థానిక అనుభూతిని అందించేలా 10 వేల హోం స్టేలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో అత్యాధునిక అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఎకో మరియు టెంపుల్ టూరిజం: అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో మరియు టెంపుల్ టూరిజం ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద చేపట్టిన దేవాలయాల అభివృద్ధి పనులను 2026 మే నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు. కాగా, ఈ పథకాల కింద మరో రూ.663 కోట్లకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
పర్యాటక కేంద్రాల అభివృద్ధి: గండికోట, సూర్యలంక, అరకు బొర్రా గుహలు వంటి ప్రాంతాలను ప్రముఖ పర్యాటక హబ్‌లుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. గోదావరి పుష్కర ఘాట్‌తో పాటు రాజమండ్రిలోని చారిత్రాత్మక హావ్ లాక్ బ్రిడ్జిపై పర్యాటకులను అనుమతించే పనులను ఈ ఏడాది డిసెంబరు నాటికల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కారావాన్ పార్కుల ఏర్పాటు, వాటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.http://AMARAVATHI NEWS







