హైదరాబాద్, సెప్టెంబర్ 24: నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సామూహిక బతుకమ్మ – దాడియా ఉత్సవాల పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని విద్యార్థినులు సంప్రదాయ చీరల్లో తళుకుతెళ్లారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా చేసిన నృత్యాలు, ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే ఈ వేడుకల్లో విద్యార్థినుల ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
“ప్రతి ఏడాది బతుకమ్మ వేడుకలను నిర్వహించడం ద్వారా విద్యార్థులకు మన సంప్రదాయాలను పరిచయం చేస్తూ, సమాజంతో అనుసంధానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నాం,” అని కళాశాల అధ్యాపకులు తెలిపారు.
బతుకమ్మ పాటలతో అడుగులు వేసిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ, “ఇది సాధారణ తరగతులకి భిన్నంగా, ఒక కొత్త అనుభూతిని కలిగించింది. అధ్యాపకులతో కలిసి ఈ విధంగా సంబరాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది,” అని చెప్పారు.