అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఎక్కువమంది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందినవారు ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్కు తరలించారు. మృతుల వివరాలు ఇవీ.. మృతి చెందిన వారిలో 1. అప్పికొండ తాతబాబు (50), 2. సంగరాతి గోవింద్ (45), 3. దాడి రామలక్ష్మి (38), 4. దేవర నిర్మల (36), 5. పురం పాప (40), 6. గంపిన వేణుబాబు (40), 7. శానవెల్లి బాబురావు (56) 8. చదలవాడ మనోహర్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా బాణాసంచా తయారీ కేంద్రంలో కూలి పనికి వచ్చినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలిని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ పరిశీలించారు. క్షతగాత్రుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆయన.. క్షతగాత్రులను మెరుగైన చికిత్సకోసం కేజీహెచ్కు తరలించాలని ఆదేశించారు.
230 Less than a minute