
విశాఖపట్నం, ఫిబ్రవరి 20:- జిల్లాలో ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ థియరీ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పరీక్షల ఏర్పాట్లపై వివరణాత్మకంగా చర్చించారు.

పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, సెక్షన్ 144 అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్‌ను నియమించడంతో పాటు సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
విద్యార్థుల సౌకర్యార్థం ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీటి సదుపాయం కల్పించాలని, పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునే విధంగా అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచనలు జారీ చేశారు. ముందస్తుగా అన్ని పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ మరియు సంబంధిత అధికారులు పరిశీలించి అవసరమైన వసతులు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని ఆదేశించారు.Visakha Local News :హెచ్ఐవీ సంరక్షణ–చికిత్సపై వైద్యులకు శిక్షణా కార్యక్రమం
ఈ సందర్భంగా ఆర్.ఐ.ఓ. మురళీధరన్ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 85 కేంద్రాల్లో థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 81,001 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. అందులో ప్రథమ సంవత్సరానికి 40,165 మంది, ద్వితీయ సంవత్సరానికి 40,836 మంది ఉన్నారని వివరించారు.
ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఒకేషనల్ గ్రూపుల ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు, సాధారణ గ్రూపుల ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు సజావుగా నిర్వహించామని వెల్లడించారు. థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు కొనసాగనున్నాయని తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు రోజు తప్పించి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జనవరి 21న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సమావేశంలో డీవీఈవో, విద్యాశాఖ, వైద్యారోగ్య, ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, రెవెన్యూ, పోస్టల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.







