
జగ్గయ్యపేట: డిసెంబరు 22:-భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం జగ్గయ్యపేట పట్టణంలో ఘనంగా శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ చేపట్టగా, సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ముందుగా పట్టణంలోని పిల్లలమర్రి భవన్‌లో పతాకావిష్కరణ చేసి, మాజీ ఎమ్మెల్యే దివంగత కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, కామ్రేడ్ మహమ్మద్ మన్సూర్‌లకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం డిపో సెంటర్, ఎన్టీఆర్ సర్కిల్, కమల సెంటర్, ముత్యాల రోడ్డు మీదుగా భారీ స్థాయిలో బైక్ ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ మాట్లాడుతూ…
“గాంధీని చంపిన గాడ్సే భావజాల వారసులు నేడు దేశాన్ని పరిపాలిస్తున్నారు” అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చే హక్కు మోడీకి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.NTR VIJAYAWADA News
జగ్గయ్యపేటను పట్టిపీడిస్తున్న వాయు కాలుష్యంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “వాయు కాలుష్యాన్ని నిర్మూలించలేవా మోడీ? ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న కాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అని సూటిగా ప్రశ్నించారు.
సిపిఐ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి 2025 నాటికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. సిపిఐ ఆవిర్భావం నుంచే రైతాంగ సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని భూమిలేని పేదలకు భూమి హక్కులు, కౌలుదారులకు రక్షణ, సాగునీరు, గిట్టుబాటు ధరల కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహించిందన్నారు.
కార్మికుల హక్కుల కోసం రోజుకు ఎనిమిది గంటల పని, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, ట్రేడ్ యూనియన్ హక్కులు సాధించడంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఈ పోరాటాల్లో వేలాది మంది నాయకులు, కార్యకర్తలు జైళ్లకు వెళ్లారని, లాఠీచార్జీలు ఎదుర్కొని ప్రాణత్యాగాలు చేశారని తెలిపారు.
నేటికీ రైతులు, కార్మికులు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రైవేటీకరణ ప్రజల జీవితాలను కుదిపేస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాడేది సిపిఐ మాత్రమేనని స్పష్టం చేశారు. శత జయంతి ఉత్సవాల స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బుడ్డి రాయప్ప, జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యదర్శి ఆంబోజి శివాజీ, నందిగామ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు, పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు, మెటీకల శ్రీనివాసరావు, కరిసే మధు, సీనియర్ నాయకులు వల్లంకొండ బ్రహ్మం, పోతుపాక వెంకటేశ్వర్లు, భోగ్యం నాగులు, చలపతిరావు, మీరా, ముజీబ్, నీలకంఠం శివప్రసాద్, శ్రీనివాసచారి, ఆదాం, మాశెట్టి రమేష్‌బాబు, షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు.







