బాపట్ల, సెప్టెంబర్ 25:గ్రామీణ ప్రాంతాలలో జల వనరుల పరిరక్షణకు సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రామీణ అభివృద్ధి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. గురువారం నాడు ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల కలెక్టర్లతో నిర్వహించిన వీక్షణ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశానికి బాపట్ల జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ హాజరయ్యారు. సమావేశంలో ఉపాధి హామీ పథకం అమలుపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, జల వనరుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం “జల సంచి జాన్ భాగే దారి” కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానంగా “జల శక్తి అభియాన్”ను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
అమృత్ సరోవర్ లక్ష్యాలను సాధించాలని సూచించిన ఆయన, జల సురక్ష, జల శక్తి మంత్రిత్వ శాఖలు చేపడుతున్న కార్యక్రమాలన్నీ ప్రజల ప్రయోజనార్థమేనని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా అధికారులను కోరారు.
ఈ సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.