
గుంటూరు, జనవరి 29 :-రానున్న జనాభా లెక్కల సేకరణ–2027 ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.

గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో 2027 జనాభా లెక్కల సేకరణ సన్నాహకాలు, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, డిస్పెన్సరీలు, ఐఎంఎస్ ఆసుపత్రుల నిర్మాణానికి భూమి కేటాయింపు, పాజిటివ్ పబ్లిక్ పెర్సెప్షన్ అంశాలపై సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ, జనాభా లెక్కల సేకరణ విజయవంతం కావాలంటే ప్రజల్లో అవగాహన అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ దిశగా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.Guntur nagaram lo
జనాభా లెక్కల సేకరణ–2027పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఐఈసీ (IEC) మెటీరియల్ రూపొందించి అన్ని జిల్లాలకు పంపాలని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్ కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ప్రగతి, డిస్పెన్సరీలు, ఐఎంఎస్ ఆసుపత్రుల నిర్మాణానికి భూమి కేటాయింపు అంశాలపై కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు అవసరమైన స్థలాల సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని సీఎస్‌కు వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కే.ఖాజావలితో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.










