
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన “హరిహర వీరమల్లు” సినిమా విజయం కోసం ఏలూరు జనసేన యాక్టివ్‌గా ముందుకొస్తోంది. ఈ సందేశాత్మక సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుతూ, బుధవారం ఉదయం ఏలూరులో భారీ బైక్ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ సందర్బంగా మంగళవారం ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ఇంచార్జ్ మరియు ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ…
“పవన్ కళ్యాణ్ గారి ప్రతి సినిమాలో ఓ సామాజిక సందేశం ఉంటుందంటూ – హరిహర వీరమల్లు సినిమా యోధుడి కథ మాత్రమే కాదు, ప్రజా సంక్షేమానికి పోరాడే ఓ ఆత్మగౌరవ యాత్ర” అని పేర్కొన్నారు.
సినిమా రంగంలో అగ్రనటుడిగా, రాజకీయ రంగంలో పేదల కోసం ఉద్యమించే నాయకుడిగా పవన్ కళ్యాణ్ నిలిచారని, ప్రతి తెలుగు వ్యక్తి గర్వించేలా ఆయన పాత్రలు, వ్యక్తిత్వం ఉంటాయని అన్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ధైర్యం, నిజాయితీ, నాయకత్వం ప్రతిఫలించనున్నాయని చెప్పారు.
ఏలూరులో బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే బైక్ ర్యాలీ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి ఆర్ఆర్ పేట, ఫైర్ స్టేషన్, పాత బస్టాండ్, మున్సిపల్ ఆఫీసు మీదుగా సాయి బాలాజీ థియేటర్ వరకు సాగనుంది. అన్ని ప్రాంతాల నుంచి మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు హాజరై ర్యాలీని విజయవంతం చేయాలని అప్పల నాయుడు పిలుపునిచ్చారు.
పవన్ కళ్యాణ్ ప్రజల పట్ల ఉన్న బాధ్యతను సినిమాల ద్వారానే కాదు, రాజకీయాల్లోనూ చూపుతున్నారని, ఆయన సేవలు గుర్తించి ప్రజలు మరింతగా అండగా నిలవాల్సిన సమయం ఇదని ఆయన తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో ఏలూరు సిటీ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షుడు దోసపర్తి రాజు, ప్రెసిడెంట్ కోమాకుల శ్రీను (పూలశ్రీను), మెగా అభిమానులు శానం శ్రీ రామకృష్ణ మూర్తి, కట్టా ఆది, పీ. జగన్, టీ. నరేష్, అరవింద్, పండు నాయుడు, పత్తేబాద ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సినిమాలోని సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ర్యాలీని ఒక ఆరంభంగా భావించాలంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. “హరిహర వీరమల్లు” చిత్రం జులై 24న విడుదల కానుంది. రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల అగ్రగామిగా నిలిచే ఈ చిత్రం కోసం అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.










