
గుంటూరు:డిసెంబరు 22:-జాతీయ వినియోగదారుల వారోత్సవాల పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సోమవారం గుంటూరు ఎస్.ఆర్. శంకరన్ హాల్‌లో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీ వరకు జాతీయ వినియోగదారుల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
వారోత్సవాల్లో భాగంగా వినియోగదారుల్లో హక్కులు, బాధ్యతలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార పదార్థాల ప్యాకింగ్‌పై ఉన్న వివరాలు, వివిధ రంగుల్లో ఉపయోగించే గుర్తులు, నాణ్యత ప్రమాణాలను ఎలా గుర్తించాలి, మోసాలకు గురైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.GUNTUR NEWS
ఈ దిశగా ముద్రించిన అవగాహన పోస్టర్లను విడుదల చేస్తూ, వాటి ద్వారా ప్రజల్లో వినియోగదారుల చైతన్యం పెంచేందుకు పౌర సరఫరాల శాఖ సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజా వలి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి. కోమలి పద్మ, డిప్యూటీ కలెక్టర్లు గంగ రాజు, లక్ష్మీ కుమారి తదితర అధికారులు పాల్గొన్నారు.







