
గుంటూరు :తాడేపల్లి:02-11-25:-మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ దొంతి రెడ్డి వేమారెడ్డి, తాడేపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.“ఏపీలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో ముందుగానే ప్లాన్ ప్రకారం జోగి రమేష్‌ను ఇరికించారు. నిజంగా న్యాయం ఉంటే ఆ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించడంలేదు?” అని వేమారెడ్డి ప్రశ్నించారు.
జోగి రమేష్ దుర్గమ్మ సాక్షిగా తాను ఎటువంటి తప్పూ చేయలేదని ప్రమాణం చేసిన విషయం గుర్తుచేసి, “మీరు ఎందుకు సత్యప్రమాణం చేయడం లేదు?” అంటూ వేమారెడ్డి సవాల్ విసిరారు.కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనలో పలువురి మృతి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆ సంఘటనపై ప్రజల దృష్టి మళ్లించేందుకు జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారంటూ వేమారెడ్డి ఆరోపించారు.







