ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ ధర్నా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించబడింది. విలేకరుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ వారు గళమెత్తారు. ముఖ్యంగా అక్రిడిటేషన్ కార్డులు, పదవీ విరమణల తర్వాత పెన్షన్లు, మరియు ఇండ్ల స్థలాల మంజూరు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జిల్లా అధ్యక్షుడు జబీర్, కార్యదర్శి హరీష్ మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్లు అందుతుండగా, ఏపీలో మాత్రం అలాంటి వెసులుబాటు లేకపోవడం బాధాకరమన్నారు. వారు బీహార్ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఉదాహరణగా చూపుతూ, ఏపీలో కూడా జర్నలిస్టులకు కనీస భద్రత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అనేకమంది జర్నలిస్టులు పదేళ్లు, ఇరవైఏళ్లు ఈ రంగంలో పనిచేసినా వారికి మౌలిక సదుపాయాలు లేవని, వారి సేవలను ప్రభుత్వం గుర్తించాల్సిన సమయం వచ్చిందని వారు స్పష్టం చేశారు. చిన్న వార్తలకు పరిగెత్తే జర్నలిస్టులు, ప్రమాదాల నడుమ ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తుంటే, వారి కుటుంబ భవిష్యత్తుకు ప్రభుత్వం కనీస భద్రత కల్పించలేదని ఆవేదన వ్యక్తమైంది.
ప్రస్తుతం జర్నలిస్టులకు పింఛన్, ఆరోగ్య బీమా, పిల్లల విద్య, హౌసింగ్ పథకాల్లో ప్రాధాన్యం లభించడం లేదని వారు ఆరోపించారు. ఈ ధర్నాలో పాల్గొన్న యూనియన్ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తమ డిమాండ్లపై త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు హెచ్చరించారు.