
Tirupati: శ్రీకాళహస్తి:20-11-25:-కార్తీక దీపాలతో ప్రకాశించిన శ్రీకాళహస్తి పట్టణం… స్వర్ణముఖి నది తీరం దీపాల కాంతులతో కళకళలాడింది. కార్తీక మాసం అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణమ్మ నదీ హారతులు ఈసారి భక్తజనంతో సందడిగా సాగాయి. శతాబ్దాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ స్వర్ణముఖి తల్లికి హారతులిచ్చినట్లు చెప్పుకొనే సాంప్రదాయాన్ని పునర్జీవింపజేస్తూ, గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం స్థానికులకు, భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

నదీ తీరం వద్ద విశేష హారతులుఅమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన అనంతరం, స్వర్ణముఖి నది ఒడ్డున ఏర్పాటు చేసిన వేదిక వద్దకు ఘనంగా తీసుకువచ్చారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ దీపప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య హారతులు శాస్రోక్తంగా ప్రారంభమయ్యాయి.ధూపం, దీపం, రథ హారతి, చక్ర హారతి, ఏక, ద్వితీయ, తృతీయ, చతుర్ధ హారతులు, పంచ హారతి, పంచ బ్రహ్మ హారతి, కుంభ హారతి, కర్పూర హారతి… ఇలా ఒక్కో హారతి నదీ నీటిమీద ప్రతిఫలిస్తూ అద్భుత దృశ్యాన్ని సృష్టించాయి. చత్రం, వింజామరం, ధ్వజము, ధామరము వంటి సంప్రదాయ దేవతారాధనా విధానాలు కార్యక్రమానికి మరింత భక్తి శ్రద్ధను తెచ్చాయి.

భక్తుల రద్దీతో సందడిస్వర్ణముఖి హారతులను ప్రత్యక్షంగా చూసేందుకు పట్టణ ప్రజలు, భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. నదీ తీరమంతా నిండిపోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమం సజావుగా సాగేందుకు ఆలయ ఈవో బాపి రెడ్డి, పాలకమండలి సభ్యులు, వేదపండితులు, ఆలయ సిబ్బంది సేవలందించారు. ట్రాఫిక్ నియంత్రణకు పట్టణ సీఐ ప్రకాష్ కుమార్ సిబ్బందితో కలిసి ముందస్తు చర్యలు చేపట్టారు.అంతర్లీనంగా భక్తి, వెలుగుల సంబరంచరిత్ర, సాంప్రదాయం, భక్తి—ఈ మూడు కలిసిన స్వర్ణమ్మ నదీ హారతులు ఈసారి మరింత ఆధ్యాత్మికతతో, మరింత విశేషంగా సాగాయి. నదీ నీటిపై నర్తించిన దీపాల కాంతులు – కార్తీక రాత్రికి అందాన్ని చేర్చాయి.







