
పలాస, నవంబర్ 1:-శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగిన తోపులాట దుర్ఘటనపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనుకోకుండా పెద్దఎత్తున భక్తులు తరలివచ్చిన కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన వివరించారు.ఘటన సమాచారం అందిన వెంటనే మంత్రి లోకేష్ హుటాహుటిన కాశీబుగ్గకు చేరుకుని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనితలతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. తర్వాత పలాస కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు.విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ,“ఏకాదశి సందర్భంగా వేలాది భక్తులు ఆలయానికి తరలిరావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు, 16 మంది గాయపడ్డారు. ముగ్గురిని ప్రత్యేక చికిత్స కోసం శ్రీకాకుళం జేమ్స్ ఆసుపత్రికి తరలించాం,” అని తెలిపారు.బ్యారికేడింగ్ లోపాలే ప్రాణాంతకంఆలయంలో ఏర్పాట్లు తగిన స్థాయిలో లేవని మంత్రి పేర్కొన్నారు. “బ్యారికేడింగ్ ఫౌండేషన్ రెండున్నర అంగుళాలే ఉంది. సాధారణంగా ఇలాంటి రద్దీ ప్రాంతాల్లో కనీసం ఆరు అంగుళాల ఫౌండేషన్ ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తోపులాట విషాదంగా మారింది,” అని చెప్పారు.ప్రభుత్వం – ప్రధానమంత్రి సాయంమృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. అంతేకాక, ప్రధాని కార్యాలయం తరపున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తామని మంత్రి తెలిపారు.“మా పార్టీ తరపున చనిపోయిన ముగ్గురు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా కింద రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తాం,” అని లోకేష్ వెల్లడించారు.
ప్రైవేట్ దేవాలయాలపై పర్యవేక్షణ తప్పనిసరిభవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాలపై పర్యవేక్షణ పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. “ప్రైవేటు వ్యక్తులు నిర్మించే దేవాలయాలపైనా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. భక్తుల రద్దీ అంచనాలు, సీసీ కెమెరాలు, క్రౌడ్ మానిటరింగ్ వంటి చర్యలు తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు,” అని పేర్కొన్నారు.దేవాలయ నిర్మాణంపై వివరాలుఈ దేవాలయాన్ని 94 ఏళ్ల భక్తుడు పాండా గారు స్వంతంగా రూ.15 నుండి రూ.20 కోట్ల వ్యయంతో 12 ఎకరాల్లో నిర్మించారని మంత్రి వివరించారు. “ప్రజలకు దేవుడిని దగ్గర చేయాలనే ఆత్మీయతతో పాండా గారు ఈ ఆలయాన్ని నిర్మించారు. కానీ అనుకోకుండా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది,” అని అన్నారు.తక్షణ సహాయంగా మృతుల కుటుంబాలకు మట్టి ఖర్చుల కోసం రూ.10 వేల చొప్పున అందజేసినట్లు లోకేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు పాల్గొన్నారు.







