
హైదరాబాద్, అక్టోబర్ 15:-దేశంలో బీసీలకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయంపై జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. “సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాదు — అది భారత రాజ్యాంగం తెలిపిన హక్కు” అంటూ స్పష్టం చేశారు.శనివారం కాచిగూడలో బీసీ యువజన నేతలు, కుల సంఘాలు, న్యాయవాదులు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న సమావేశంలో జాతీయ బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ జాతీయ చైర్మన్‌గా దుండ్ర కుమారస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. త్వరలో పూర్తి కార్యవర్గాన్ని ప్రకటించనున్నట్టు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 9 అమలుపై హైకోర్టు స్టే విధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. “ఇది బీసీల ఆత్మగౌరవం, సమాన హక్కుల కోసం పోరాటం. ఇక భారీ ఆందోళన తప్పదు” అని ఆయన హెచ్చరించారు.ఈ నెల 18న జరగనున్న రాష్ట్ర బందును బీసీ సమాజం మొత్తం ఐక్యంగా మద్దతివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. బందులో యువత, మహిళలు, కార్మికులు, వృత్తిదారులు, కార్పొరేట్ ఉద్యోగులు కూడా భాగస్వాములు కావాలని కోరారు.బీసీల రిజర్వేషన్లకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. “బీసీ రిజర్వేషన్ల బిల్లును రాజ్యాంగంలోని షెడ్యూల్-9లో చేర్చాలి. తద్వారా సుప్రీంకోర్టు జోక్యం లేకుండా రిజర్వేషన్లకు పూర్తి రక్షణ లభిస్తుంది. ఇది చేయకపోతే దేశవ్యాప్తంగా బీసీ సమాజం చరిత్రాత్మక ఉద్యమానికి సిద్ధమవుతుంది,” అని కుమారస్వామి హెచ్చరించారు.జేఏసీ ఏర్పాటు బీసీల కోసం సామూహిక పోరాటానికి శుభసూచికమని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా బీసీ యువత, న్యాయవాదులు, డాక్టర్లు, ఉద్యోగులు, కార్మికులు, శ్రామికులు, ఎంబీసీలు, సంచార, అర్థసంచార కులాలన్నీ “అఖిలపక్ష బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ”లో భాగస్వాములవుతాయని వివరించారు.







