అమరావతి, అక్టోబర్ 8: రాష్ట్రంలో కల్తీ లిక్కర్ తయారీ, విక్రయాలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనిపై ఎక్సైజ్, పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖలు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువు ఘటనపై జరిపిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ కేసులో ఇప్పటివరకు 21 మంది నిందితులుగా గుర్తించామని, వీరిలో 12 మందిని అరెస్టు చేసి, మరికొంతమందిని త్వరలో పట్టుకుంటామని అధికారులు వివరించారు. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్థన్‌రావు వ్యాపారాలపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నట్టు సమాచారం.
“ఫేక్ ప్రచారాలతో ప్రజలను భయపెట్టొద్దు”
రాష్ట్రంలో కల్తీ మద్యం పేరుతో సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రతి మూడు మద్యం బాటిల్స్‌లో ఒకటి కల్తీ అని అపప్రచారం చేస్తున్నారు. ఇది ప్రజలను భయపెట్టే కుట్ర మాత్రమే,” అని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలను నిర్ధారించకుండా మద్యం మరణాలపై ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిపై విచారణ జరిపి నిజం వెలికి తీయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అవసరమైతే పోస్టుమార్టం వంటి శాస్త్రీయ పరీక్షల ద్వారా నిజమైన మరణ కారణాలు బయటపెట్టాలని సూచించారు. “కల్తీ లిక్కర్ వల్లే మరణం అయితే నిర్ధారణ చేయాలి. కాకపోతే తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి,” అని సీఎం స్పష్టం చేశారు.
రాజకీయ కుట్రలపై గట్టిగా స్పందన
వైసీపీ నేతలు ఈ కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించిన సీఎం చంద్రబాబు, “2019లో వివేకా హత్యను కూడా ఇలానే రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వీటిని నమ్మే పరిస్థితిలో లేరు,” అని మండిపడ్డారు.
ఈ విషయంలో ప్రభుత్వ మంత్రులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, తప్పుడు ప్రచారాలపై వెంటనే స్పందించి వాస్తవాలు ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు.
పాలకులపై సీఎం కీలక సూచనలు
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర నేరుగా హాజరవ్వగా, హోంమంత్రి సహా ఇతర మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వారితో మాట్లాడిన సీఎం, కల్తీ మద్యం తయారీకి పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని, ఇకపై రాష్ట్రంలో ఒక్కటైనా నకిలీ మద్యం కేంద్రం ఉండకూడదని స్పష్టం చేశారు.
మీడియా, సోషల్ మీడియాకు హెచ్చరిక
తప్పుడు ప్రచారాలు చేస్తున్న మీడియా, సోషల్ మీడియా ఖాతాలపై కూడా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. “ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం కోసం ఎవరు ప్రయోగాలు చేస్తే ఊరుకోము. ప్రభుత్వం మౌనంగా ఉండదు,” అని హెచ్చరించారు.