
కారంపూడి (పల్నాడు జిల్లా), మార్చి 09: కారంపూడి పట్టణ శివారులోని మాచర్ల రోడ్డులో ఉన్న ఓల్డ్ మాట్రిక్స్ పవర్ ప్లాంట్ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న బైక్ మరియు ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నరసరావుపేటకు తరలించారు.
ప్రమాదం జరిగిందిలా..
స్థానికుల కథనం ప్రకారం.. రాత్రి సుమారు 10:50 గంటల సమయంలో కారంపూడి పట్టణం నుండి ఒకే బైక్‌పై ముగ్గురు యువకులు అడిగొప్పుల తిరునాళ్లకు వెళ్తున్నారు. అదే సమయంలో ఒప్పిచర్ల గ్రామం నుండి కారంపూడి వైపు వస్తున్న ఆటో.. పవర్ ప్లాంట్ ఆపోజిట్ వద్ద బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
క్షతగాత్రుల వివరాలు:
ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులతో పాటు ఆటోలో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
- సాగిబోయిన విష్ణు (20): బైక్ నడుపుతున్న ఈ యువకుడికి తలకు బలమైన గాయం కావడంతో పాటు చెయ్యి, కాలు విరిగాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైమరీ ట్రీట్‌మెంట్ అనంతరం నరసరావుపేట ఆసుపత్రికి రిఫర్ చేశారు.
- సూరేపల్లి సాయి (20): తలకు గాయమైంది.
- కొండా నితీష్ (20): స్వల్ప దెబ్బలతో బయటపడ్డారు.
- గొడుగు గురవయ్య (36 – ఆటో డ్రైవర్): తలకు గాయమైంది.
- వేలుపూరి అంజి (48): ముక్కు నుండి తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు కాలు విరిగింది.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Palnadu district Telugu local news: పల్నాడు జిల్లా తెలుగు లోకల్ న్యూస్







