
హైదరాబాద్ :26-11-25:-కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు పన్నుతోందని కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ ప్రతిని చేతబట్టి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ ఆర్డీవో రామకృష్ణతో కలిసి మహేశ్వర్ రాజ్ మాట్లాడుతూ…
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్థానంలో మనువాద శాస్త్రాన్ని తీసుకురావాలని కొందరు అగ్రవర్ణ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లభిస్తున్న హక్కులు, అభివృద్ధి అవకాశాలు కొందరికి నచ్చడం లేదన్నారు.

“రాజ్యాంగం ఒక పుస్తకం మాత్రమే కాదు… ఈ దేశ సబ్బండ వర్గాల పవిత్ర గ్రంథం,” అని మహేశ్వర్ రాజ్ స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏకమై మనువాద శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.







