
బాపట్ల జిల్లా:26-11-25:- కొలలపూడి–బొల్లాపల్లి మధ్య ఒకటి, కొణికి పరిధిలో మరోటి—మొత్తం రెండు కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యుత్ లోపాలు, లో-వోల్టేజ్ సమస్యలు, తరచూ జరిగే విద్యుత్ అంతరాయాలు, వ్యవసాయ బోర్లకు నీటి సరఫరాలో ఇబ్బందులు వంటి సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గత కొంతకాలంగా ప్రత్యేకంగా ఫాలోఅప్ చేసిన విషయం తెలిసిందే.ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానికులకు, ముఖ్యంగా రైతులకు ఉపశమనం లభించనుంది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న వ్యవసాయ కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుంటే ప్రస్తుతం ఉన్న లైన్ సామర్థ్యం సరిపోకపోవడం వల్ల గ్రామాలు ఇన్నాళ్లు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నాయి. నూతన సబ్‌స్టేషన్లు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు.
రైతులతో పాటు పరిశ్రమలకు కూడా భారీగా మేలు కలుగుతుందని, వోల్టేజ్ స్థిరీకరణతో విద్యుత్ సరఫరా నాణ్యత గణనీయంగా మెరుగవుతుందని అంచనా.ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ తక్షణ స్పందనకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.







