
బాపట్ల, నవంబర్ 3:-కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో నాసిరకం విత్తనాల సరఫరా కారణంగా సుమారు వెయ్యి ఎకరాల్లో వరి పంట నష్టపోయింది. ఈ ఘటనపై సిపిఎం పార్టీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బాపట్ల కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు భారీ నిరసన చేపట్టారు. పాడైన వరి కంకులను తీసుకొచ్చి ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు, ప్రజాపిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్. గంగయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ, “ఎన్నారై అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నాసిరకం విత్తనాలు సరఫరా చేయడం వల్ల రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. పంట దశలోనే తెగుళ్లు రావడంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. రైతులు నెల రోజులుగా అధికారులను పలుమార్లు కలిశినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
వారు మాట్లాడుతూ, “ఎన్నారై కంపెనీ మొదట సహాయం చేస్తామని చెప్పి, ఇప్పుడు బాధ్యత తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నష్టంతో ఎక్కువగా కౌలు రైతులే దెబ్బతిన్నారు. ఒక్కో ఎకరానికి కనీసం రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. లేకపోతే తీవ్ర ఆందోళనలకు సిద్ధం అవుతాం” అని హెచ్చరించారు.జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు స్వయంగా పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి. కృష్ణమోహన్, జిల్లా నాయకులు బి. సుబ్బారావు, స్థానిక రైతులు ధూళిపాల రవి, జాలాది ధనుంజయ్ రావు, నాగళ కృష్ణ రావు, సతీష్, రత్నబాబు, అశ్విని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
 
 






