
ఏలూరు, ఫిబ్రవరి 09:–ఏలూరు నగరంలో మౌళిక సదుపాయాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయని టిడిపి జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. రామకృష్ణాపురం మినీ బైపాస్ రోడ్డు నుంచి వంగాయగూడెం రోడ్డుకు అనుసంధానంగా కృష్ణకాలువపై నిర్మిస్తున్న నూతన వంతెన పనులను ఆయన కూటమి నాయకులతో కలిసి శనివారం స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇప్పటికే పూర్తైన ఫిల్లర్లు, రివిట్మెంట్ వాల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, వంతెన నిర్మాణ పురోగతిపై అధికారులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు వెడల్పు విషయంలో ఎదురవుతున్న సమస్యలు తన దృష్టికి రావడంతో, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న పంపుల చెరువు నీటిగొట్టాల సమస్యను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్పొరేషన్, ఆర్అండ్బి అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని అక్కడికక్కడే సూచించారు. అలాగే వంతెన ఎత్తుకు అనుగుణంగా విద్యుత్ స్తంభాలను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ట్రాన్స్కో ఈఈ కె.ఎం. అంబేద్కర్ను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్లాబ్ నిర్మాణాన్ని వేగవంతం చేసి, పనులు నిర్దేశిత గడువులో పూర్తిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ఏలూరు జ్యూట్మిల్ వద్ద కాలువపై ఉన్న పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో దాని పక్కనే నూతన వంతెన నిర్మాణానికి సత్వర చర్యలు చేపట్టామని తెలిపారు. మార్చి నెలాఖరు నాటికి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. కాలువ వదిలేలోగా వంతెన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు. స్థానికులకు ఇచ్చిన హామీ మేరకు రేవు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇప్పటికే గుర్తించామని తెలిపారు.ELURU JILLA VAARATHALU
ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలనే దురుద్దేశంతో వైసీపీ నాయకులు దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, టిడిపి, జనసేన నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.










