

పిల్లల దత్తత ప్రక్రియ చట్టబద్ధంగానే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. మిషన్ వాత్సల్య పథకంపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన గోడపత్రాలను జిల్లా కలెక్టర్ సోమవారం స్థానిక కలెక్టరేట్లో విడుదల చేశారు.
మిషన్ వాత్సల్య పథకం కింద దత్తత ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ప్రతి నవంబర్ మాసంలో దత్తత మాసోత్సవాలు జరుగుతాయన్నారు. గతంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా దత్తత నిర్వహిస్తుండగా, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే కారా ద్వారా ఈ ప్రక్రియ సాగుతుందన్నారు. చెత్త కుండీలు, చెత్త కుప్పలు, కాల్వలు, చిల్ల చెట్ల వద్ద పడవేసిన అనాధ శిశువులను శిశు గృహంలో ఆశ్రయం కల్పిస్తున్నట్లు చెప్పారు. వారిని దత్తత ఇవ్వడానికి కారా ద్వారా ప్రక్రియ చేపడతామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డి ఆర్ ఓ జి.గంగాధర్ గౌడ్, ఆర్డీవో గ్లోరియా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పిడి రాధా మాధవి, తదితరులు పాల్గొన్నారు.







