Palnadu News: కార్మిక, కర్షక, చిరుద్యోగుల గొంతుక పిడిఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇవ్వండి… యుటిఎఫ్ జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశంలో
UTF MEETING ON MLC ELECTION
ఈ నెల 27 న జరగనున్న ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజా, కార్మిక, కర్షక, చిరు ఉద్యోగుల గొంతుక పిడిఎఫ్ అభ్యర్థి ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు గెలుపుకై ప్రజా సంఘాలతో కలిసి యుటిఎఫ్ విస్తృతంగా పని చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ టి.ఎస్.ఎల్.ఎన్ మల్లేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో యుటిఎఫ్ పల్నాడు జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశం యుటిఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మల్లేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటివరకు ఏ సంఘానికి సాధ్యం కాని విధంగా 50 ఏళ్లుగా ప్రభుత్వ విద్య రంగ పరిరక్షణకు, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి ఇటీవల స్వర్ణోత్సవాలు విజయవంతంగా నిర్వహించుకున్నామని అదే స్ఫూర్తితో రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో కూడా సమర్థవంతంగా పనిచేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కె. ఎస్ లక్ష్మణరావు గెలిపించుకోవాలన్నారు. బడి కోసం బస్సు యాత్ర పేరుతో యుటిఎఫ్ చేసిన పోరాటం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకున్నామని ప్రభుత్వ విద్యా రంగం కాపాడటమే యుటిఎఫ్ లక్ష్యమన్నారు. పోరుబాటకు స్పందించిన ప్రభుత్వం రూ 3 వేల కోట్ల ఆర్థిక బకాయిలను విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇప్పటివరకు గెలుపొందిన 14 మంది పిడిఎఫ్ అభ్యర్థులు సమర్థవంతంగా పనిచేశారని గుర్తు చేశారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఇచ్చిన హామీలు అమలు చేయని విధానాలను నిరుద్యోగుల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. నీతి నిజాయితీగా పనిచేసే నిర్మాత్మక నిర్మాణాత్మక ప్రతిపక్షమే పిడిఎఫ్ అన్నారు. 117 రద్దు తర్వాత మార్పుల గురించి జాబ్ క్యాలెండర్ గురించి డిఎస్సీ ల గురించి ప్రశ్నించే సత్తా పిడిఎఫ్ అభ్యర్థికే ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో డీఎస్సీని నిలుపుదల చేశామని కూటమి ప్రభుత్వం చెప్పటం డొంకతిరుగుడుకు నిదర్శనమన్నారు. జూన్ నుండి జనవరి వరకు ఇవ్వాల్సిన టి ఏ బకాయిలను ఇంతవరకు కూటమి ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 నెలల కాలంలో పెన్షన్ మినహా సూపర్ సిక్స్ అమలు చేయని ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే డీఎస్సీ విడుదల చేస్తామని పట్టబద్ధులను, నిరుద్యోగులను మభ్యపెడుతున్నారన్నారు.