
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించేందుకు గ్యాస్ సిలిండర్ బుకింగ్ (Gas Cylinder Booking) నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.
గ్రామాల్లో 45 రోజులు.. పట్టణాల్లో 25 రోజులు
సవరించిన కొత్త నిబంధనల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య వ్యవధిని కేంద్రం ఏకంగా 45 రోజులకు పెంచింది. అంటే గ్రామాల్లో ఒకసారి సిలిండర్ బుక్ చేసిన తర్వాత, మళ్లీ బుక్ చేసుకోవాలంటే 45 రోజులు ఆగాల్సిందే. అయితే, పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇటీవల 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచిన నిబంధననే యథాతథంగా కొనసాగించనున్నారు.
నిబంధనలు ఎందుకు కఠినతరం చేశారు?
గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్‌ను (Black Marketing) అరికట్టడానికే బుకింగ్ వ్యవధిని పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
- గతంలో సగటున 55 రోజులకోసారి గ్యాస్ బుకింగ్ చేసుకున్న వినియోగదారులు..
- ఇటీవల కేవలం 15 రోజులకే మళ్లీ గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సిలిండర్ల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిబంధనలు కఠినతరం చేశారు.

పెద్ద కుటుంబాలకు పెరగనున్న కష్టాలు
బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. గ్రామీణ ప్రాంతాల్లోని పెద్ద కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. సాధారణంగా 5 గురి కంటే ఎక్కువ మంది సభ్యులు ఉండే కుటుంబానికి ఒక గ్యాస్ సిలిండర్ నెల రోజుల్లోపే అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో, కొత్త గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం 45 రోజులు వేచి ఉండాల్సి వస్తే మిగతా రోజులు వంట ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
వార్తలోని ముఖ్యాంశాలు (Key Highlights):
- గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్ గడువు: 45 రోజులు
- పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్ గడువు: 25 రోజులు
- ప్రధాన కారణం: బ్లాక్ మార్కెటింగ్ నివారణ & యుద్ధ ఉద్రిక్తతలు
- ప్రభావం: గ్రామాల్లోని ఉమ్మడి మరియు పెద్ద కుటుంబాలపై భారం.
గమనిక: మీ ఇంట్లో గ్యాస్ వినియోగాన్ని బట్టి, ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు (ఇండక్షన్ స్టవ్ వంటివి) చేసుకోవడం మంచిది.







