
విజయవాడ, నవంబర్ 4:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు గారు మాజీ సైనికుల సమస్యలు, వారి సంక్షేమానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలను ప్రస్తావించారు. విజయవాడ సెంటర్ నియోజకవర్గం గాంధీనగర్‌లోని ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.సాంబశివరావు మాట్లాడుతూ, ప్రభుత్వంవైపు నుండి మాజీ సైనికుల సంక్షేమానికి ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. “మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం పది కోట్లు కేటాయిస్తామని చెప్పినా, సంవత్సరం ఆరునెలలు గడిచినా ఆ ఏర్పాటు జరగలేదు. ఇతర కార్పొరేషన్లు ఏర్పడ్డా, మాజీ సైనికుల కార్పొరేషన్ మాత్రం మాటలకే పరిమితమైందన్నారు.
అలాగే, నేరారోపణలు లేని అర్హులైన వ్యక్తులనే కార్పొరేషన్ చైర్మన్ లేదా సభ్యులుగా నియమించాలని సూచించారు. కొత్త జిల్లాల పేర్లు నిర్ణయించే సమయంలో దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీర సైనికుల పేర్లు కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.ప్రస్తుతం ఉన్న 2% రిజర్వేషన్‌ను 10%కి పెంచాలని డిమాండ్ చేసిన సాంబశివరావు, హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతి వల్ల న్యాయం జరగడం లేదని వ్యాఖ్యానించారు. “దానిని రద్దు చేసి ప్రత్యేక రిజర్వేషన్ విధానంలో అమలు చేయాలి,” అని స్పష్టం చేశారు. యుద్ధ విధవలకు (War Widows) ప్రత్యేక అవకాశాలు కల్పించాలని సూచించారు.అలాగే, విపత్తులు, అల్లర్లు, తుఫానులు వంటి అత్యవసర పరిస్థితుల్లో పోలీసు శాఖకు శిక్షణ పొందిన మాజీ సైనికులను సూచించారు.దేశ సేవ కోసం రాష్ట్రం వెలుపల చదువుకునే మాజీ సైనికుల పిల్లలను స్థానికులుగా గుర్తించకపోవడం అన్యాయం అని వ్యాఖ్యానించారు. “వారు ఎక్కడ చదివినా మన రాష్ట్రానికి చెందిన వారే,” అని చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత భూముల కోసం మూడు సంవత్సరాల లోపు దరఖాస్తు చేయాలనే షరతును తొలగించి, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునేలా జి.ఓ సవరించాలని డిమాండ్ చేశారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ సైనికులు మరియు వారి కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన ప్రభుత్వం ను కోరారు. రాష్ట్రంలోని కొన్ని చోట్ల మాజీ సైనికులపై దాడులు, దురాగతాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, వాటిని అరికట్టేందుకు ప్రత్యేక జి.ఓ. విడుదల చేయాలని కోరారు.రాష్ట్రంలో సుమారు 1.1 లక్షల మంది మాజీ సైనికులు ఉన్నారని, వారి కుటుంబ సభ్యులతో కలిపి 6 లక్షల మందికి పైగా ఈ వర్గానికి చెందినవారని తెలిపారు. “ప్రభుత్వం ఈ వర్గంపై అశ్రద్ధ వహించడం తగదు. మాజీ సైనికులు ఎల్లప్పుడూ ప్రభుత్వానికి తోడుగా ఉంటారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు,” అని సాంబశివరావు అన్నారు.
 
 






