
మచిలీపట్నం: డిసెంబర్ 11:-రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ పాలన అమలు, ఈ-ఫైల్ వ్యవస్థలో కృష్ణా జిల్లా మరోసారి తన ప్రతిభను చాటుకుంది. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సాధించి ఆదర్శంగా నిలిచారని సంయుక్త కలెక్టర్ ఎం. నవీన్ కొనియాడారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన ర్యాంకింగ్‌లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 1,482 ఈ–కార్యాలయ దస్త్రాలు స్వీకరించిన కలెక్టర్, వాటిలో 1,469 దస్త్రాలను వేగవంతంగా పరిష్కరించారు. సగటు స్పందన సమయం 14 గంటలు 42 నిమిషాలు మాత్రమే నమోదు కావడం గమనార్హం. దీంతో డిజిటల్ పాలనలో కృష్ణా జిల్లా రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలిచింది.ఈ విజయాన్ని పురస్కరించుకుని సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు కలెక్టర్ డీకే బాలాజీకి శాలువాలు, జ్ఞాపికలు అందజేస్తూ సత్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ,“ఎదురైన ఏ దస్త్రం కూడా ఆలస్యం కాకుండా సత్వరమే పరిష్కరించడం నా లక్ష్యం. ఇదే స్పూర్తితో ముందుకు సాగుతాం” అన్నారు. దస్త్రాల పరిష్కారంలో సంయుక్త కలెక్టర్ నవీన్ రాష్ట్రస్థాయి ర్యాంకింగ్స్‌లో 3వ స్థానం పొందినందుకు ఆయనను స్వయంగా అభినందించారు.జిల్లాలోని ఇతర అధికారుల పనితీరును కూడా సమీక్షించి, వారికీ ర్యాంకులు కేటాయించే వ్యవస్థ అమలులో ఉందని కలెక్టర్ తెలిపారు.కార్యక్రమంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, కెఆర్‌ఆర్ సిఎస్‌డిసి శ్రీదేవి, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు శివప్రసాద్, హరిహరనాథ్, జడ్పీ సీఈఓ కన్నమ నాయుడు, రహదారులు–భవనాల ఈఈ లోకేష్, డీఈవో సుబ్బారావు, డిఎస్ఓ మోహన్ బాబు, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, ఉద్యాన అధికారి జ్యోతి, ఆర్డబ్ల్యూఎస్‌ఎస్‌ఈ సోమశేఖర్‌తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.







