మచిలీపట్నం: డిసెంబర్ 15:-జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మిల్లర్లను కోరారు. ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలు, గోనె సంచులను సమకూర్చి పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు.
సోమవారం రాత్రి నగరంలోని కలెక్టరేట్ “మీకోసం” సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి జిల్లాలోని మిల్లుల యజమానులతో ధాన్యం సేకరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఏడాది జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 149 కంబైన్డ్ హార్వెస్టర్ల ద్వారా వరి కోతలు సాగుతున్నాయని, దీంతో ఒకేసారి భారీగా ధాన్యం సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రభుత్వం పెద్ద ఎత్తున గోనె సంచులు, వాహనాలు సమకూర్చినప్పటికీ అవి పూర్తిగా సరిపోవడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు తమ వద్ద ఉన్న గోనె సంచులు, వాహనాలను కూడా వినియోగంలోకి తెచ్చి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.
జిల్లాలో ఇప్పటికే 75 శాతం వరి కోతలు పూర్తయ్యాయని, ప్రస్తుతం 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ధాన్యాన్ని తీసుకునేందుకు మిల్లర్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, రోజుకు 20 వేల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం సేకరించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అలాగే బ్యాంకు గ్యారంటీలను సిద్ధం చేసుకోవాలని, కోత కోసిన వెంటనే రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని బాగా ఆరబెట్టేందుకు మిల్లుల వద్ద ఉన్న డ్రైయర్లను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్న 1318 రకం వరి ధాన్యాన్ని కూడా తప్పనిసరిగా సేకరించాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు త్వరలో మరో 10 లక్షల గోనె సంచులు రానున్నట్లు తెలిపారు.సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరాం ప్రసాద్, జిల్లా మిల్లర్ల సంఘం అధ్యక్షుడు వీరయ్యతో పాటు పలువురు మిల్లుల యజమానులు పాల్గొన్నారు.







