ప్రత్తిపాడు, సెప్టెంబర్ 23:పర్యావరణ పరిరక్షణలో మాజిక్ డ్రైన్లు కీలకపాత్ర పోషిస్తాయని ఉపాధి హామీ పధకం డైరెక్టర్ వై.వి. కె. షణ్ముఖ్ కుమార్ అన్నారు. ప్రభుత్వంతో వినూత్నంగా, ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ మాజిక్ డ్రైన్ నిర్మాణం పల్లె ప్రాంతాల్లో మురుగు నీటి నిర్వహణలో విప్లవాత్మక మార్పుని తీసుకురానుందని తెలిపారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం శివారు బుర్రావారిపాలెం గ్రామంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన 75 మంది ఉపాధి హామీ పధకం సిబ్బందికి (EC/JE, TA & FA) మాజిక్ డ్రైన్ నిర్మాణం, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
“మురుగు నీరు భూగర్భజలంగా మారుతుంది”
డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ మాట్లాడుతూ, “సాధారణ డ్రైన్లకు భిన్నంగా మాజిక్ డ్రైన్లలో వ్యర్థ నీరు ఫిల్టర్ మీడియా గల ట్రెంచ్ ద్వారా భూమిలోకి ఇంకే విధంగా ఉంటుంది. ఇది పర్యావరణ హితంగా ఉండడమే కాకుండా భూగర్భజలాల పరిరక్షణకు ఉపయోగపడుతుంది,” అని అన్నారు.
గ్రామాల్లో ఈ మాజిక్ డ్రైన్ల ద్వారా స్వచ్ఛత, ఆరోగ్యం మెరుగవుతాయని, భూగర్భ జలాలు పెరగటానికి తోడ్పడతాయని తెలిపారు. నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించిన ఆయన, ఒక్క మాజిక్ డ్రైన్ నిర్మాణపు ఖర్చు లక్ష రూపాయల దాటి పోకూడదని స్పష్టం చేశారు.
నిర్మాణంలో పాటించాల్సిన నిబంధనలు:
- మొదటి పొరగా 100 మిమీ గల పెద్ద రాళ్లు,
- రెండవ పొరగా 70–40 మిమీ రాళ్లు,
- పై పొరగా 20–10 మిమీ రాళ్లు వాడాలన్నారు.
- గృహాల నుంచి వచ్చే నీరు డ్రైన్ కన్నా పైగా ఉండేలా చూడాలని,
- మాజిక్ డ్రైన్ చివర వాగు లేదా సిమెంట్ డ్రైన్‌లో కలిసే ప్రదేశంలో జాలీ ఏర్పాటు చేయాలని సూచించారు.
- మంచినీటి పైపులుండే ప్రాంతాల్లో నిర్మాణానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఎంపికైన మండలాల్లో లక్ష్యాలకు అనుగుణంగా ప్రతిపాదనలు వెంటనే ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పధకం అడిషనల్ కమిషనర్ శివప్రసాద్, జాయింట్ కమిషనర్ సునీత, చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గోపీచంద్, డ్వామా పి.డి. శంకర్, ఏ.పి.డి. శ్యాలాదేవి, ఎం.పి.డి.ఓ శివపార్వతి, సర్పంచ్ జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.