
హైదరాబాద్, అక్టోబర్ 11:జాతిపిత మహాత్మా గాంధీపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్ భారత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.
వాక్చాతుర్యానికి కూడా హద్దులు ఉంటాయని వ్యాఖ్యానించిన వెంకట్, “వాక్ స్వాతంత్రం పేరిట కొంతమంది హద్దులు మీరి మాట్లాడుతున్నారు. మహాత్మా గాంధీ వంటి మహానేతలపై ఈ స్థాయిలో అసభ్య వ్యాఖ్యలు చేయడం ఖండనీయం. దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలి,” అని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంపై సినీ ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలని కోరుతూ, త్వరలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచును కలిసి శ్రీకాంత్ భారత్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు.
“గాడ్సే వారసులమంటూ చెప్పుకునే కొంతమంది ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ సమాజాన్ని మోడలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు,” అని వ్యాఖ్యానించిన వెంకట్, రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చే దిశగా టీపీసీసీ ముందుకెళ్తుందని వెల్లడించారు.
భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే శ్రీకాంత్ భారత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.







