
విజయవాడ, అక్టోబర్ 14: భారత జాతిపిత మహాత్మా గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జోన్–C ఆధ్వర్యంలో విజయవాడ సెంటర్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు సోమవారం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆప్ నాయకులు మాట్లాడుతూ, “మహాత్మా గాంధీ వంటి మహానుభావుడిని దూషించడం కేవలం వ్యక్తిగత అభిప్రాయంగా కాకుండా, దేశ ప్రజాస్వామ్య విలువలపై దాడిగా భావించాలి. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడమే కాదు, వారికి మద్దతుగా నిలుస్తున్న సోషల్ మీడియా ఖాతాలపైనా చట్టపరమైన విచారణ జరగాలి,” అని డిమాండ్ చేశారు.ఈ వినతి కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు, పౌర సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు. గాంధీ సిద్ధాంతాలను అపహాస్యం చేసే పనులు నిషేధించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.పౌర సమాజంలో తీవ్ర ఆవేదన నెలకొన్న ఈ నేపథ్యంలో, తమ డిమాండ్లను ప్రభుత్వానికి చేరవేసేందుకు మీడియా మిత్రులు ముందుకు రావాలని, ప్రజాస్వరం వినిపించేందుకు వారికి భరోసా కావాలని కార్యకర్తలు మనవి చేశారు.







